భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి సన్నిధిలో ఏప్రిల్ 17వ తేదీన సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 25వ తేదీన కల్యాణోత్సవ పనులు ప్రారంభం కానున్నాయి. ఉదయం పసుపు కొమ్ములు దంచే వేడుక, కల్యాణ తలంబ్రాలు కలిపే వేడుకను నిర్వహించిన అనంతరం శ్రీరామచంద్రుని పెళ్లి కుమారున్ని చేయనున్నారు. తదుపరి ఆలయంలో హోలీ పండుగ సందర్భంగా వసంతోత్సవం, డోలోత్సవం వేడుకలను నిర్వహిస్తారు.
ఆ రోజు నుంచి ఆలయానికి రంగులు దిద్దడం, చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం, తోరణాలు కట్టడం, విద్యుత్ దీపాలు అలంకరించటం వంటి పనులను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 16వ తేదీన ఎదుర్కోలు మహోత్సవం, 17వ తేదీన సీతారాముల కళ్యాణ మహోత్సవం, 18వ తేదీన మహా పట్టాభిషేకం వేడుకను నిర్వహించనున్నారు. సీతారామ కల్యాణ ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వేసవి కాలం సందర్భంగా భక్తులు ఎండకు అవస్థలు పడకుండా వసతులు కల్పించడంపై దృష్టి సారిస్తున్నారు.