హైదరాబాద్‌లోని కూకట్పల్లి రంగధాముని చెరువు కట్ట దిగువన ఉన్న భారతి ట్రావెల్స్‌లో ఈనెల 12న అర్ధరాత్రి మూడు బస్సులు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డ్యూటీకి వెళ్లనందుకు ఆగ్రహించిన యజమాని అతడి బంధువు గదిలో డ్రైవర్‌ను నిర్బంధించి చితకబాదాడనే కోపంతోనే గ్యారేజీలో బస్సులకు నిప్పుపెట్టాడని కూకట్పల్లి ఏసీపీ ఎ.చంద్రశేఖర్ తెలిపారు.
‘కృష్ణారెడ్డికి చెందిన ఈ గ్యారేజీలో నిత్యం 11 బస్సులు నిలిపి ఉంచుతారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన పసుపులేటి వీరబాబు(34) రెండు నెలలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం వీరబాబును డ్యూటీకి వెళ్లాల్సిందిగా యజమాని కృష్ణారెడ్డి ఆదేశించాడు. తాను సొంతూరు వెళ్లాల్సి ఉందని, డ్యూటీకి వెళ్లనని వీరబాబు తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహంచిన యజమాని కృష్ణారెడ్డి, సోదరుడి కుమారుడైన యశ్వంత్‌రెడ్డితో కలిసి వీరబాబును గదిలో బంధించి వాహన ఇంజిను బెల్టు, కొబ్బరి మట్టలతో చితకబాదారు. వారిపై పగ తీర్చుకోవాలనుకున్న వీరబాబు అర్ధరాత్రి దాటాక గ్యారేజీకి వెళ్లి ఓ బస్సుపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో పక్కనే ఉన్న మరో రెండు మినీ బస్సులు సైతం కాలిపోయాయి.’ అని ఏసీపీ వెల్లడించారు.