ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఆందోళనకరంగా వున్నదని..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. డిస్కం లు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం రూ 62,461 కోట్లు. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు అన్నారు.
ఈ అప్పుల మొత్తంలో రూ 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం అని వివరించారు. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ 28,673 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించవలసి వుందన్నారు.
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసి లఘు చర్చను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముక. వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణా మరియు సమాచార రంగాల మనుగడ కైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం అన్నారు.