జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్‌కు అరుదైన ఘనత దక్కింది. భూపాలపల్లికి చెందిన డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల తీసిన ఫొటో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై ప్రదర్శించారు. ఎన్‌ఎఫ్‌టీఎన్‌వైసీ అనే సంస్థ ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో 5 వేల ఫొటోలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో అరుణ్ కుమార్ తీసిన చిత్రం పోటీలో ఎంపికై న్యూయార్క్ టైం స్క్వేర్ బిల్‌బోర్డుపై మంగళవారం రాత్రి నుంచి ప్రదర్శితమవుతోంది.
ఈ విషయాన్ని అరుణ్ కుమార్ తెలిపారు. నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందని, తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో లలిత కళా అకాడమీ నిర్వహించిన మేళా మూమెంట్ ఫొటోగ్రఫీ పోటీల్లోనూ ఆయన ఇటీవల బహుమతి అందుకున్నారు. గత డిసెంబర్‌లో ప్రధాని మోదీ అరుణ్ కుమార్ తీసిన ఫొటోల గురించి మన్ కీ బాత్‌లో ప్రస్తావించడం గమనార్హం.