తెలంగాణలో కలిసి పనిచేయండి.. కిషన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌లతో అమిత్‌షా

-

తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అంశంపై క్లారిటీ వచ్చింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌లకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచించారు. రేపటిలోగా సీట్ల విషయంలో ఓ అవగాహనకు రావాలని చెప్పినట్లు సమాచారం. అందుకు అంగీకరించిన కిషన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్‌ .. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని చెప్పినట్లు సమాచారం.

జనసేన ఉమ్మడి హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ, మెదక్‌ జిల్లాల్లో 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది. అయితే ఈ సమావేశంలో అమిత్‌షా, పవన్‌కల్యాణ్‌లు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు కుదుర్చుకున్న విషయం అమిత్‌షా వద్ద చర్చకు రాలేదని, తెలంగాణలో కలిసి పనిచేసే విషయం మాత్రమే చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఏపీలో టీడీపీతో కలిసి వెళ్లాలని పవన్‌కల్యాణ్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ టీడీపీ కలిసివస్తుందా అన్న ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిస్తూ జనసేన ఒక్కటే ఎన్డీయే భాగస్వామి అని.. అంతవరకే తమ చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news