తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపిస్తోంది. మొన్నటి దాకా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన సీఎం కేసీఆర్.. దసరా పండుగ సందర్భంగా నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇవాళ్టి నుంచి రెండో విడత ప్రచారం ప్రారంభించనున్నారు. రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.
మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ప్రచారం ఉద్ధృతం చేశారు. కేసీఆర్ భరోసా పేరిట భారాస మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఆసరా పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు ఇస్తున్న 2వేల 16 పింఛన్‌ను దశల వారీగా 5వేల 16కు, దివ్యాంగుల పింఛన్ 4 వేల 16 నుంచి 6,016కు పెంచబోతున్నట్లు తెలిపారు.
‘మేనిఫెస్టోలోని అంశాలను జనంలోకి తీసుకెళ్తాం. ఈ మేనిఫెస్టోలోని అంశాల పై పార్టీ శ్రేణులంతా ఊరూరా విస్తృతంగా ప్రచారం కల్పించాలిని. పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రం నాశనమవడం ఖాయం. రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించాలంటే.. రాష్ట్రాన్ని గద్దలపాలు చేయొద్దు’ అని ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.