తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. కేసీఆర్ భరోసా, ఆరు గ్యారెంటీలతో మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక అభ్యర్థులను ప్రకటించి ప్రచార రేసులో కాస్త లేటుగా చేరిన బీజేపీ ప్రస్తుతం ప్రచారంలో జోరు సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నేతలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారంలో రెండు సార్లు రాష్ట్రానికి వచ్చి బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ఇక మరోసారి మోదీ రాష్ట్రానికి రానున్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 24, 25, 27 తేదీల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 27వ తేదీన కరీంనగర్ బహిరంగసభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌లో రోడ్‌షోతో మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మూడు రోజులు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా 5 రోజులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ మూడు రోజులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 17వ తేదీన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీన్ని పార్టీ అధ్యక్షుడు లేదా కేంద్రంలోని కీలక మంత్రి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌షా మేఫెస్టోను విడుదల చేస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు.