కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా చేస్తే.. ఎస్సీని సీఎం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రెండు పార్టీలు కూడా బీసీలను మోసం చేశాయని ఆరోపించారు. బీజేపీ మొదటిసారి బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించిందని.. తమ పార్టీని గెలిపిస్తే బీసీ అభ్యర్థి మొదటి సీఎం అవుతారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని.. కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి పట్టం కట్టాలని కోరారు.
రాజ్యాధికారంలో బహుజనులకు భాగస్వామ్యం కల్పించటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు విఫలమయ్యాయని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ వస్తే బడుగుల జీవితాల్లో వెలుగు రాలేదని ఒక కుటుంబానికి మాత్రమే వెలుగులు, సంపద వచ్చాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను ఓట్లుగా ఉపయోగించుకుంటున్నాయని…. ఈ ఎన్నికల్లో 25సీట్లకు మించి కేటాయించలేదని మండిపడ్డారు. చిన్నకులాలకు సైతం ప్రాతినిధ్యం కల్పించిన ఘనత తమకే మాత్రమే దక్కుతుందన్నారు. ఏ రాజ్యాధికారం కోసమైతే పోరాడుతున్న ఆ కల సాకారమయ్యే అవకాశాన్ని కల్పించిన భాజపాకు మద్దతునివ్వాలని లక్ష్మణ్ కోరారు.