సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం రోజున సచివాలయంలో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కలిశారు. లండన్లోని థేమ్స్ నదీ అభివృద్ధి తరహాలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల లండన్ పర్యటన విశేషాలు ముఖ్యంగా.. థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అధ్యయనంపై సీఎం రేవంత్ రెడ్డి బ్రిటీష్ హైకమిషనర్తో తన ఆలోచనలు పంచుకున్నారు. మూసీ ఒడ్డున అభివృద్ధితో పాటు నదీ సంరక్షణకు ప్రాధాన్యమిచ్చేలా, స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారు.
మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పరీవాహక అభివృద్ధి ప్రణాళికలపై బ్రిటిష్ హై కమిషనర్ అభినందలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్, ఎకో టూరిజంకు సహకరిస్తామని తెలిపారు. సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, డిప్యూటీ హై కమిషనర్ గారేత్ వైన్ ఒవేన్ తదితరులు పాల్గొన్నారు.