తెలంగాణలో ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించి.. జెండా పాతాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా పటిష్ఠ ప్రణాళికతో ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ప్రస్తుతం ఆ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లే పనిలో పడింది. ఓవైపు ఎన్నికలకు వ్యూహాలు రచిస్తూ ప్రచారంలో దూసుకెళ్తూనే మరోవైపు పార్టీలో కీలక నేతల చేరికలపై ఫోకస్ పెడుతోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు వంటి కీలక నేతలను పార్టీలో చేర్చుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు నేతలతో పాటు వారి అనుచర గణం హస్తం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు దిల్లీ చేరుకోగా ఉదయం మరికొందరు హస్తిన చేరుకోనున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆరేపల్లి మోహన్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌తోపాటు భువనగిరికి చెందిన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. వారు కాకుండా మరో 10 నుంచి 12 మంది రెండుపార్టీల నుంచి వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.