యాదాద్రిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. దళితులు, బహుజనులను అవమానించారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రిని వారి కాళ్ల వద్ద కూర్చోబెట్టారని మండిపడ్డారు. దేవుని ముందు ఉపముఖ్యమంత్రికి ఇంత అవమానం జరిగితే ఎలా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్పై బాల్క సుమన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వెంటనే సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టిని కాళ్ల దగ్గర కూర్చోబెట్టి యావత్ దళిత, బడుగు బలహీన వర్గాలను అవమానించారు. దళిత, బడుగులు చాలా బాధ పడుతున్నారు. సాక్షాత్తూ దేవుని ముందే ఇంత అవమానం జరిగితే ఎలా? ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. దీనిపై మేధావులు స్పందించాలి. ప్రకటనల్లో భట్టి విక్రమార్క ఫొటో ఉండదు. ఉపముఖ్యమంత్రి లేకుండానే సీఎం ఆయన శాఖల సమీక్షలు నిర్వహిస్తారు. జరిగిన దానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. దొరల పాలన అంటూ మొన్నటి వరకు విమర్శించిన వారు ఈ నయా దేశముఖ్ పాలనపై స్పందించాలి. రేవంత్ ఆచరణ, వ్యవహార శైలి, ప్రవర్తనకు ఇవాళ్టి ఘటన నిదర్శనం. కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పందించాలి.’ అని బాల్క సుమన్ మండిపడ్డారు.