ఎస్డిఆర్ఎఫ్ నిధులు వినియోగించి వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అయ్యింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి విఫలమైందని తేట తెల్లం అయ్యింది అన్నారు. వరద ప్రభావం పై ఇప్పటివరకు కేంద్రానికి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖతో కాంగ్రెస్ వైఫల్యం బయటకు వచ్చింది. ప్రభుత్వ ఖాతాలో ఉన్న 1345.15 కోట్ల ఎస్డిఆర్ఎఫ్ నిధులను వినియోగించకుండా మౌనంగా ఉంది ప్రభుత్వం.
కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరితో విపత్తు నిర్వహణకు నిధులు ఉన్నప్పటికీ నిరుపయోగమయ్యాయి. ఈ ఏడాదికి సంబంధించి 208 కోట్ల ఎస్డిఆర్ఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జూన్ నెలలోనే జమ అయ్యాయి. ఈ నిధులను సైతం వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. కేంద్రానికి యుటిలైజేషన్ లెటర్ ఇచ్చే సోయి లేకపోవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపం గా మారింది. కాంగ్రెస్ అవగాహనరాహిత్యం నిర్లక్ష్యపు పోకడతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేరుకుంది అని హరీష్ రావ్ అన్నారు.