బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన స్వేద పత్రం విడుదల కార్యక్రమం ఇవాళ జరగనుంది. శనివారమే విడుదల చేయాలని తొలుత భావించినా… వివిధ కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆర్థిక, ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అందుకు పోటీగా స్వేదపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ భవన్ వేదికగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు ఇవ్వనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు జరిగిన లబ్ది, సృష్టించిన ఆస్తుల వివరాలు, విలువను స్వేదపత్రం ద్వారా వెల్లడించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయంలో తీసుకొచ్చిన మార్పు వ్యవసాయం సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల్లో అభద్రతను పోగొట్టి కల్పించిన స్థైర్యం, తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించనున్నారు. ఇటీవలే శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ రంగాలపై శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే.