నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఈనెల 21వ తేదీనే ఈ భేటీ జరగాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు వీలుగా ఈరోజు జరగనున్న ఈ భేటీలో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాల్లో దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నలోపాలపై చర్చించడంతోపాటు, వాటిని నిలువరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

అంతే కాకుండా కాంగ్రెస్‌ ప్రకటించిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజా పాలన’ కార్యక్రమాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించనున్నారు. ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news