BRS అంటే.. ” బరాబర్ రైతు సావుకోరే పార్టీ” – వైఎస్ షర్మిల

-

వరి వేస్తే ఉరేనన్న మాటను నియంత కేసీఆర్ అమలు చేస్తున్నాడని విమర్శించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల. యాసంగి పంటను కొనకుండా కల్లాల కాడనే రైతులను కాటికి పంపుతున్నాడని మండిపడ్డారు. రెండు నెలలైనా వడ్లు కొంటలేరని, రోడ్లపై పడి ధర్నాలు చేస్తున్నా.. ఐకేపీ సెంటర్ల ముందే పారబోసి ధాన్యాన్ని కాలబెడుతున్నా.. దొరకు చీమ కుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అరిగోస పడుతున్నా.. ఒక రివ్యూ లేదు.. కనీసం దొర ఆరా తీసింది లేదన్నారు.

రాష్ట్రమంతా ధాన్యం కొంటలేరని రైతన్నలు కన్నెర్ర చేస్తుంటే.. ఒక మంత్రి తాలు కాలబెట్టి నాటకాలా అంటూ అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మరో మంత్రి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నమని,రికార్డ్ అంటూ జబ్బలు చర్చుకుంటున్నడని విమర్శించారు. “1.30 లక్షల టన్నుల ధాన్యం పండితే సగం కొనక పోవడం రికార్డ్ అంటరా..? పోనీ మీరు చెప్పిన 80 లక్షల టన్నులకు 50 లక్షల టన్నులు కొనడం గొప్ప విషయమా..? రెండు నెలల్లో 50 లక్షల టన్నులు కొన్న మీరు.. వారం రోజుల్లో వస్తున్న వర్షాకాలానికి 30 లక్షల టన్నులు కొనగలరా..? అంతా పచ్చి అబద్ధాలు..బూటకపు మాటలు. ధాన్యం కొనడం చేతకాక, రికార్డులు అని భజన చేయడం ఒక్కటే భజన బ్యాచ్ కి తెలుసు.

అవును మీది రికార్డుల సర్కారే.. 9 ఏళ్లలో 9 వేల మంది రైతులను బలి తీసుకోవడం మీకు రికార్డ్. 9 ఏండ్లలో 14 వేల కోట్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వని పాలన ఒక రికార్డ్. రుణమాఫీ అని చెప్పి ఎగ్గొట్టడంలో సరికొత్త రికార్డ్. బ్యాంకుల దగ్గర రైతులను దొంగలు చేసిన రికార్డ్ దేశంలో మీదే కదా.. మాట ఇచ్చి పంగనామాలు పెట్టుట్ల మీకు మీరే రికార్డ్. రైతులకు ఇస్తామని చెప్పిన 10 వేలకు దిక్కులేదు. కొన్న ధాన్యానికి రూపాయి ఇచ్చింది లేదు. అందుకే BRS అంటే… “బరాబర్ రైతు సావుకొరే పార్టీ” అంటూ తీవ్ర విమర్శలు చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version