రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇటీవలే తన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు అందులో స్వల్ప మార్పులు చేసే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్థానానికి ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని బీాఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.
ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరనే విషయంలో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతోపాటు మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తామని హన్మంతరావు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి హరీశ్‌రావుపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
తీరా అభ్యర్థుల జాబితాలో మల్కాజిగిరి అభ్యర్థిగా ఆయన పేరు ఉండటంతో ఇదే విషయాన్ని విలేకరులు సీఎం వద్ద ప్రస్తావించారు. ‘టికెట్ కేటాయించాం. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలా? లేదా అనేది ఆయన ఇష్టం’ అని సీఎం వ్యాఖ్యానించారు.