భారతదేశమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన చంద్రయాన్-3 మరికాసేపట్లో జాబిల్లి దక్షిణ ధృవంపైన అడుగుపెట్టబోతోంది. గత నెల 14న నింగిలోకి రివ్వున దూసుకెళ్లిన వ్యోమనౌక- దాదాపు 41 రోజుల ప్రయాణం అనంతరం బుధవారం జాబిల్లి ఉపరితలంపై దిగేందుకు సన్నద్ధమైంది.
అనూహ్య ప్రతికూలతలేవీ తలెత్తకుండా.. అన్నీ అనుకున్నట్టే సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం సరిగ్గా 6:04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద కాలుమోపుతుంది. ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర పుటల్లో తిరుగులేని రికార్డును తన పేరిట లిఖించుకున్నట్లవుతుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశమంతా తిలకించేలా ఇస్రో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేసింది. కొన్ని ప్రభుత్వాలు పాఠశాలల్లో విద్యార్థులకు కూడా ఈ ఘట్టం వీక్షించేలా లైవ్ ఏర్పాట్లు చేశాయి.
చంద్రయాన్-3 విషయంలో ఇస్రో చాలా జాగ్రత్తలు తీసుకుంది. వైఫల్య ఆధారిత డిజైన్ ద్వారా వ్యోమనౌకను రూపొందించి.. అదనపు సెన్సర్లు అమర్చింది. ఒకటి విఫలమైనా.. మరొకటి ఆ బాధ్యతను అందిపుచ్చుకునేలా కీలకమైన వ్యవస్థల విషయంలో ప్రత్యామ్నాయాలు ఏర్పాటుచేసింది. అందుకే ఈసారి సాఫ్ట్ ల్యాండింగ్‌ను సాధించడం ఖాయమని ధీమాగా ఉంది.