రాష్ట్ర రెవెన్యూ రాబడులు గతేడాది(2022-23) ఆశించిన స్థాయిలో రాలేదని కాగ్ తాజా నివేదిక వెల్లడించింది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2.45 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ.1.92 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపింది. ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబడులు, వ్యయాలను కాగ్ తాజా నివేదికలో తెలిపింది.
కాగ్ నివేదిక ప్రకారం.. రెవెన్యూ రాబడులు అంచనాలకన్నా 21.67శాతం తక్కువగా వచ్చాయి. పన్నులపై రాబడులు బాగున్నా ఇతర పద్దుల్లో తగ్గుదల కారణంగా పడిపోయినట్లు తేలింది. ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.17,500 కోట్లు వస్తుందనుకుంటే రూ.970.45 కోట్లు అధికంగా సమకూరింది. మద్యం అమ్మకాలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్దు కింద రూ.12,407 కోట్లు అంచనా వేయగా 12.79శాతం అదనంగా రావడం విశేషం.
రెవెన్యూ రాబడులు ఏకంగా 21.67శాతం పడిపోవడంతో ఆమేరకు అభివృద్ధి పనులకు వెచ్చించాల్సిన నిధులు కూడా అదే నిష్పత్తిలో తగ్గినట్లు కాగ్ వెల్లడించింది. మొత్తం వార్షిక వ్యయం రూ.2.19 లక్షల కోట్లు ఉంటుందని రాష్ట్ర బడ్జెట్‌లో అంచనా వేసింది. చివరికి అంతకన్నా రూ.48,153.98 కోట్లు తక్కువగా ఖర్చు చేసింది.