కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీపై ఎలాంటి అనుమతి లేకుండా డ్రోన్‌తో చిత్రీకరించిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్‌లపై కేసు నమోదు చేశారు. జులై 26వ తేదీన కేటీఆర్, నాయకుల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఎలాంటి అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారు. మేడిగడ్డ బ్యారేజీకి ఏం కాలేదని, రేవంత్ సర్కార్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
దీనిపై జులై 29వ తేదీన బ్యారేజీ ఇంజినీరు మహదేవపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యారేజీకి ముప్పు వాటిల్లేలా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అదే రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇన్ని రోజులు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.