నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా యాజమాన్య బోర్డు యాజమాన్యానికి (కేఆర్ఎంబీ) అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు అధికారిక వర్గాల సమాచారం. రాష్ట్ర ఎన్నికల సమయంలో సాగర్ వద్ద జరిగిన ఘటనల దృష్ట్యా రెండు రాష్ట్రాల అధికారులతో బుధవారం రోజున కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. సాగర్ వద్ద సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షణ కొనసాగించాలని ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని జలశక్తి శాఖ వెల్లడించింది.
నాగార్జున సాగర్ నిర్వహణపై ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం చెబుతామని అధికారులు జలశక్తి శాఖ కార్యదర్శికి తెలిపినట్లు సమాచారం. విద్యుత్ ప్రాజెక్టులు, అవుట్‌లెట్స్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అధికారులు సాంకేతిక పరిమితులపైనా నిర్ణయించాల్సి ఉందని కార్యదర్శికి వివరించారు. ఏఏఔట్‌లెట్స్ ఎవరి పరిధిలో ఉండాలో తేలాల్సి ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు. సాంకేతిక అంశాలపై ఇద్దరు సీఈవోలు చర్చించి ఓ నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు. సాంకేతిక అంశాలపై నివేదిక వచ్చాకే తదుపరి భేటీ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు నవంబర్ 28వ తేదీకి ముందున్నస్థితి కొనసాగించేలా చూడాలని జలశక్తి శాఖ కార్యదర్శిని రాష్ట్ర అధికారులు కోరగా సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది.