బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం పై ఒత్తిడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఈ తరుణంలోనే మార్చి 10వ తేదీన ఛలో ఢిల్లీకి పిలుపునివ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మార్చి 10న జంతర్ మంతర్ వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి దీక్ష చేయాలని భావిస్తున్నారు. ఆ దీక్ష వేదిక నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు అన్ని పార్టీలను కలుపుకొని పోవాలని రేవంత్ భావిస్తున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఈ అంశాన్ని చేర్చింది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు చెప్పడంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు పెంచవచ్చు. ఆ అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్, కాంగ్రెస్ కీలక నేతలంతా ఢిల్లీలో దీక్ష చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.