ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో కూటమి లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని అన్నారు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారని మండిపడ్డారు. ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసను.. కాళేశ్వరం నీళ్లందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతలను తెలంగాణ ప్రజలకు తెలిపేందుకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 200 మంది బీఆర్ఎస్ నేతలు 180 కిలోమీటర్లు పాదయాత్రగా తరలివెళ్లారు. ఈ పాదయాత్ర ముగింపు సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. “ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు.. అందరూ ఒక్కో కేసీఆర్ లాగా తయారై తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి. తెలంగాణను ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టనున్న రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌దే.” అని అన్నారు.