పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సమ్మర్ హాలిడేస్‌లో జాలీగా ఉదయం 10 గంటల వరకు పడుకున్న పిల్లలు ఇప్పుడు ఉదయాన్నే ఆరు గంటలకు నిద్ర లేవాల్సి వస్తోంది. అయితే చాలా మంది పిల్లలు సరిగా నిద్ర లేక అనారోగ్యానికి గురవుతున్నారు. ఇది గమనించి తెలంగాణ విద్యాశాఖ పాఠశాలల సమయాల్లో కొన్ని మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో కొంత ముందుగా మొదలవుతాయి. ‘‘ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులైనందున వారు ఉదయం త్వరగా నిద్ర లేవరు. అందువల్ల వారికి ఉదయం 9.30 గంటలకు తరగతులకు మొదలు కావాలి. ఉన్నత పాఠశాలల్లో ఉండేది పెద్ద పిల్లలైనందున ఉదయం 9 గంటలకు మొదలుకావాలి. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా బడి సమయాలు ఉన్నాయి’’ అని కొందరు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తెచ్చారు. అందువల్ల అన్ని పాఠశాలలను ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో సమయాల మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.