TSPSC క్వశ్చన్ పేపర్ లీకే కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పేపర్ లీక్‌తో పాటు అభ్యర్థులు పరీక్షలో అధునాతన టెక్నాలజీ ఉపయోగించి పరీక్షలు రాసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఏఈఈ పరీక్షలో కొంతమంది అభ్యర్థులు చాట్‌జీపీటీ సహకారంతో సమాధానాలు గుర్తించినట్టు సిట్ విచారణలో తేలింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పేపర్ లీకేజీ వ్యవహారంపై వరంగల్ విద్యుత్తు శాఖ డివిజనల్ ఇంజినీర్ (డీఈ) రమేశ్‌ను సిట్ విచారించిన సమయంలో ఈ కోణం బయటపడింది.
ముగ్గురు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో వెళ్లగా, డీఈ రమేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానాలు గుర్తించి, వారికి చేరవేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో డీఈ రమేశ్ సహా నలుగురిని సిట్ సోమవారం అరెస్ట్ చేసింది. డీఈ రమేశ్ ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. ఓ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా కొనసాగుతున్నారు. ప్రశాంత్, నరేశ్, మహేశ్ అనే ముగ్గురు అభ్యర్థుల వద్ద రూ.20 లక్షల చొప్పున తీసుకుని పరీక్షా కేంద్రం నిర్వాహకులతోనూ ముందే డీల్ చేసుకొన్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో పరీక్షా కేంద్రంలోకి వెళ్లగా ఇన్విజిలేటర్ సాయంతో క్వశ్చన్ పేపర్ ఫొటో పొంది.. చాట్ జీపీటీ ద్వారా అభ్యర్థుల గ్యాడ్జెట్లకు రమేశ్ సమాధానాలు పంపించాడు.