తెలంగాణ పోలింగ్ అప్డేట్స్.. పలుచోట్ల ఘర్షణలు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.52 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే కొన్నిచోట్ల మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చేటు చేసుకుంది. ఓవైపు పోలింగ్‌ జరుగుతుండగా.. రెండు పార్టీలకు చెందిన మద్దతుదారులు ఘర్షణకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. మరోవైపు జనగామ జిల్లా 245వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌, సీపీఐ, బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్​కు మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకొని చెదరగొట్టారు.

మరోవైపు కామారెడ్డిలో బాలుర పాఠశాల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికేతరుల వాహనాలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో.. స్థానికేతరుల వాహనాలను పంపాలని బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version