ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొద్ది రోజుల క్రితం పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేపట్టారు. 109 రోజులు 1360 కిలోమీటర్లు కొనసాగించిన భట్టి పాదయాత్ర నేటితో ముగియనుంది. ధరణి పోర్టల్ సమస్యలతోపాటు పోడు భూముల పట్టాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి అనేక సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టారు.
ఈ ఏడాది మార్చి 16న పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్ రావు ఠాక్రే ప్రారంభించారు. మార్చి 19న ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించగా ఏప్రిల్ 14న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మండే ఎండలు, వర్షాలు, ప్రతికూల పరిస్థితులను లెక్క చేయకుడా భట్టి పూర్తి చేశారు.
ఆ పాదయాత్రకు దారి వెంబడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని.. భట్టిని కలుస్తూ సంఘీభావం తెలిపారు. పాదయాత్ర 17 జిల్లాల్లోని 36 నియోజకవర్గాల్లోని 750 గ్రామాల్లో కొనసాగింది. ఆ పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని నేడు ఖమ్మంలో జరిగే తెలంగాణ గర్జన సభకు చేరుకోనుంది. ఖమ్మంలో జరగనున్న తెలంగాణ జనగర్జన సభకు హాజరవుతున్న రాహుల్ గాంధీ భట్టి విక్రమార్కను సన్మానించి పాదయాత్రను విరమింపజేస్తారు.