నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తరువాత చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మొన్న నర్సింగ్ విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశామని తెలిపారు. త్వరలోనే గ్రూపు 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 15 రోజుల్లోనే 15వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో పల్లీ, బఠానీలు అమ్ముకునేటట్టు.. మార్కెట్ లో ప్రశ్న పత్రాలు లభించేవి. మా ప్రభుత్వం ఇప్పుడు పటిష్టంగా పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధం అయింది. ఇటీవలే TSPSC ని ప్రక్షాళన చేశాం. త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులు పరీక్షలకు సన్నద్దం కావాలని సూచించారు. అదేవిధంగా గత ప్రభుత్వం 25వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు కల్పించిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇచ్చిందన్నారు. 100 రోజుల్లోనే రైతుబంధు పూర్తి చేస్తామని ఇది వరకే ప్రకటించామన్నారు.