ఉద్యోగులకు కొత్తగా పీఆర్సీ నియమించి, జీతాలు పెంచుతామని కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవలి శాసనసభా సమావేశాల్లో నేను స్వయంగా ప్రకటించానని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్…అనంతరం మాట్లాడారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందని వివరించారు. నూలు రసాయనాలపై 50శాతం సబ్సిడీని అందజేస్తూ నేతన్నకు చేయూతనిస్తున్నదని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. గుంటమగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం ‘‘తెలంగాణ చేనేత మగ్గం’’ అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల రూపాయల బీమాను కల్పిస్తున్నదని వెల్లడించారు సీఎం కేసీఆర్.