మంథని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. రాజకీయ పరిణితి లేకపోవడంతో ఎన్నికలు రాగానే ఆగమాగం లక్షల కోట్లు పెట్టి సంతలో పశువుల్లా మాదిరి నాయకులను కొనడం జరుగుతోంది. ఇది సరికాదు. అబద్దాలు, పనికిమాలిన ఆరోపణలు జరుగుతాయి. ఇవన్నీ అధిగమించాలంటే రాజకీయ పరిణితి పెరగాలి. అలా రాజకీయ పరిణితి పెరిగిన దేశాల్లో పేదరికం, దరిద్రం పోతున్నాయి. మనదేశంలో కూడా రావాలి. ప్రజలు గెలిచేటటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి.
ప్రజస్వామ్య దేశంలో వజ్రాయుధం ఓటు. ఆ ఓటు మీ తలరాతను మారుస్తది. ఆషామాషీగా నాలుగు పైసలకు ఆశపడి ఓటు వేయొద్దు. మన తలరాతను లిఖించే ఓటును జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. అందుకే నేను కోరేది ఏంటంటే.. ఆగమాగమై ఓట్లు వేయొద్దు. మీరు ఊరికి పోయిన తర్వాత మీ ఊర్లలో చర్చ చేయాలి. కేసీఆర్ మాటలపై పది మందిని పోగేసి చర్చ చేయాలని కేసీఆర్ సూచించారు.
తెలంగాణ ప్రజలు, హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. 15 ఏండ్లు ఉద్యమం చేశాం.
10 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశామో మీ కండ్ల ముందుంది. కాంగ్రెస్ ఏకబిగిన 50 ఏండ్లు పరిపాలించింది. ఆంధ్రాలో తెలంగాణను కలిపింది కాంగ్రెస్ పార్టీ. సమైక్య రాష్ట్రంలో మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంట్ లేదు. ఉద్యమాలు, తుపాకీ మోతలు, ఎన్‌కౌంటర్లు, అమాయకులు చనిపోవడం, పోలీసులు చనిపోవడం రక్తపాతంలా ఒక విచిత్రమైన పరిస్థితి. ఆ దుస్థితి ఎవరి వల్ల వచ్చిందో ఆలోచించాలి. ఇవాళ తియ్యగా మాట్లాడితే సరిపోదు. ఇదంతా మీ చరిత్ర కాదా..? 58 ఏండ్లు మా గోస పోసుకున్నది మీరు కాదా..? మొన్నటికి మొన్న కూడా ఇబ్బంది పెట్టారు.