తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి మరో రెండ్రోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకాస్త ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇప్పటివరకు 90 సభలకు ఆయన హాజరయ్యారు.
అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ షాద్‌నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి సభల్లో పాల్గొననున్న కేసీఆర్… పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఇవాళ్టి సమావేశాలతో సీఎం పాల్గొన్న సభల సంఖ్య 94కు చేరుతుంది. రేపు మరో రెండు సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఉమ్మడిగా జరగనున్న సభతోపాటు గజ్వేల్ సభలో కేసీఆర్ పాల్గొంటారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పెద్దపల్లి, ధర్మపురి, చెన్నూరు, హుజూరాబాద్, ఏటూరునాగారంలో రోడ్ షోలలో పాల్గొంటారు. సాయంత్రం హైదరాబాద్‌లోని అంబర్‌పేట, ముషీరాబాద్‌లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో కేటీఆర్ పాల్గొంటారు. మంత్రి హరీశ్‌రావు జహీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.