నేడు సిద్దిపేట, సిరిసిల్లా జిల్లాలలో BRS ప్రజా ఆశీర్వాద సభ జరుగనుంది. ఈ తరుణంలోనే.. ఈ రెండు సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకి సభకి హాజరుకానున్నారు సీఎం కేసీఆర్. దీంతో గులాబీమయంగా మారింది సిద్దిపేట. ఈ సందర్భంగా 20 వేల మందితో BRS కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ ఉండబోతుంది.
సీఎం కేసీఆర్ సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసులు. సభకు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇవాళ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. లక్ష మంది హాజరుకానున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేసింది సిరిసిల్ల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ. సిరిసిల్ల పట్టణంలోని సభా స్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించి, పార్టీ నేతలకు పలు సలహాలు, సూచనలు చేశారు కేటీఆర్.