రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టం గా ఉండాలని అప్రమత్తం చేశారు.
కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, ఆ కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.