తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీ వెళ్లారు. కొద్ది సేపటి క్రితమే బేగంపేట ఏయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి వెళ్లారు. ఈ టూర్‌లో వీళ్ళు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అవనున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నట్టు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్‌ఎస్ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లివ్వకపోయినా సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లివ్వలేని వారికి కార్పొరేషన్ పదవులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీకి వెళ్లారని సమాచారం. దీనికి తోడు రేపు ఆర్ధిక, రైల్వే శాఖ కేంద్ర మంత్రులతో సీఎం బృదం సమావేశం కానుంది. దీంతో పాటు ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో కూడా సీఎం పాల్గొంటారు.