ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి వారితో చర్చించనున్నారు. సచివాలయంలో ఉదయం 9.30కు ఈ భేటీ ప్రారంభం కానుంది.
ఈ కీలక సమీక్షలో మంత్రులు, సీఎస్, డీజీపీ, అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం – సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు – ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం.. తదితర 9 అంశాలను ఎజెండాలో చేర్చినట్లు తెలిసింది. ఈ మేరకు ఎజెండాలో చేర్చాల్సిన సమాచారాన్ని సోమవారం సంబంధిత శాఖలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి అందజేశాయి. వాటన్నింటినీ క్రోడీకరించి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులకు అందజేస్తారు. అంశాల వారీగా ముఖ్యమంత్రి చర్చించి, ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు.