రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయంటూ ఇటీవల టీజీఐఐసీ ప్రకటన విడుదల చేయడంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఓవైపు ప్రతిపక్షాలు మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ భూవివాదంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భూవివాదం విషయంలో అసత్య ప్రచారాలపై సీరియస్ అయ్యారు. ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారని ఆరోపించారు. నిజాలను మార్చే ఫేక్ వీడియోలు ప్రమాదకరం అని అన్నారు. ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరం అన్న రేవంత్ రెడ్డి.. వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలు వైరల్ చేశారని మండిపడ్డారు. ఫేక్ కంటెంట్‌పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.