కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ పాలన చూసే ఓటు వేయాలని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను కోరతామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యను అర్థం చేసుకొని పరిష్కరిస్తోందని తెలిపారు.
తాము అధికారం చేపట్టినప్పటి నుంచి పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ నాటికి తమ ప్రభుత్వ పాలనను కొలమానంగా పెట్టుకొని ఓట్లు వేయాలని ప్రజలను కోరతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లు ఓ అవగాహనతో కలిసి పోటీ చేస్తున్నాయనడానికి ఇప్పటివరకూ ఆ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు, నియోజకవర్గాలను పరిశీలిస్తే అర్థమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు బలమున్నచోట బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారని, మిగిలిన వాటిని బీజేపీకి వదిలేశారని ఆరోపించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను ప్రతిపక్షనేతగా ఎలా అనుకోమంటారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలను మీ పాలనకు రెఫరెండంగా భావించవచ్చా అన్న విలేకరుల ప్రశ్నకు రేవంత్ స్పందిస్తూ ఏమైనా అనుకోవచ్చని వ్యాఖ్యానించారు.