స్కిల్ వర్సిటీలో 15 కోర్సులు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకలేదని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో స్కిల్ వర్సిటీ రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ వేసిన పునాదిరాయితో హైదరాబాద్‌లో ఐటీ రంగం వేళ్లూనుకుందని.. ప్రపంచంలో ఐటీరంగ నిపుణులు భారతీయులు నలుగురు ఉంటే.. అందులో తెలుగువారు ఒకరు ఉంటారని పేర్కొన్నారు.
సాంకేతిక నిపుణుల కోసం ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తుందని.. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి దిగ్గజసంస్థలకు సీఈవోలుగా భారతీయులు ఉండటం గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్‌గాంధీ నిర్ణయం వల్లే కంప్యూటర్ యుగంలో భారత్ ప్రపంచంతో పోటీపడుతుందని.. సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో యువత పోటీ పడాలని తెలిపారు. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమ జరిగిందని.. మహాత్మాగాంధీ నిర్వహించిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజీవ్‌గాంధీ అందించిన సాంకేతిక నైపుణ్య స్ఫూర్తితో ఈ యూనివర్సిటీ ప్రారంభించుకుంటున్నట్లు వెల్లడించారు.