చేపలు, గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలిసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో వాటి పంపిణీపై విజిలెన్స్ విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. ఆ రెండు పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్ విభాగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమికంగా తేలిన అంశాలను ఏసీబీతో పంచుకోవాలని సూచించారు. సచివాలయంలో పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం చేపలు, గొర్రెల పంపిణీ పథకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాల అమల్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. గొర్రెల అమ్మకందార్లకు ఇవ్వాల్సిన నిధుల్లో గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించిన ఏసీబీ నలుగురు అధికారులను కూడా అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.