బీసీలు అంటే బలహీన వర్గాలు కాదని బలమైన వర్గాలు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బీసీలంటే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీలంటే బలహీనవర్గాలు కాదని నమ్మిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అని, అందుకే వారిని బలమైన వర్గాలుగా మార్చారని తెలిపారు. ఆయన అడుగుజాడల్లోనే నడిచిన పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను మరింత ప్రోత్సహించారని లోకేశ్ వెల్లడించారు. ఇప్పుడు వారిలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేశామని నారా లోకేశ్ తెలిపారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, ఆదరణ పథకానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పారు. వారికోసం కేంద్రంలో ప్రత్యేక శాఖ ఉండాలని టీడీపీనే తీర్మానం చేసిందన్న లోకేశ్.. జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారని అన్నారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులు రూ.75వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. బీసీలంటే అతనికి చిన్నచూపు.. వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరని మండిపడ్డారు. మంగళగిరిలో తాను ఓడినా.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని స్పష్టం చేశారు.