హైదరాబాద్ కంచ గచ్చిబౌలి పరిధిలోని భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితులపై అందుబాటులో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో ఈ విషయంపై చర్చించారు. కాసేపట్లో ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని టీజీఐఐసీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని తేల్చి చెబుతూ తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరో ప్రకటన రిలీజ్ చేశారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందని మంత్రి తెలిపారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందింది లేదని ఆయన స్పష్టం చేశారు.