డిసెంబర్ 04న సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన పై ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో టీవీ ఛానెల్ కాంక్లెవ్ ఇంటర్వ్యూలో స్పందించారు. పుష్ప-2 బెనిఫిట్ షోకి మేమే అనుమతి ఇచ్చాం. సరైన ఏర్పాట్లు లేకుండా ఆయనే థియేటర్ కి వచ్చాడు. కారు ఎక్కి నమస్కారం చేస్తూ.. ర్యాలీ చేశారు. ఒక మహిళా చనిపోయింది. ఓ బాబు కోమాలో ఉన్నాడు. దీనిపై మేము కేసు నమోదు చేయకపోతే.. కేసు నమోదు చేయలేదని మమ్మల్ని అడగరా..? అన్నారు.
ఇందులో మా ప్రమేయం ఏమి లేదని తెలిపారు. మీరు ఏ హీరోకి అభిమాని అనే ప్రశ్నకు.. “నేను ఏ స్టార్ హీరో ఫ్యాన్ కాదు. నేనే ఒక స్టార్‌ను. నాకే ఫ్యాన్స్ ఉండాలి” అంటూ సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి. మరోవైపు అల్లు అర్జున్ భార్య కుటుంబం నాకు బంధువులే.. అల్లు అర్జున్ మామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అన్నారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ సైలెంట్ గా సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండకపోయేది. ర్యాలీ వల్లనే సమస్య వచ్చిందని తెలిపారు.