తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారి హరీంద్రనాథ్ రేవంత్కు స్వాగతం పలికారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించారు. రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితుల ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌కు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు రేవంత్ తన మనవడి తలనీలాలను శ్రీవారికి సమర్పించారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు సమయం పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఏటీసీ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,744 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి 35,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో నరసింహస్వామి జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో నరసింహస్వామికి ప్రత్యేక అభిషేకం చేశారు. వసంత మండపంలో మధ్యాహ్నం నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.