తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు దోహదపడే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన శనివారం రోజున అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం రోజున అమెరికా చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఇతర అధికారుల బృందానికి న్యూయార్క్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు, పలువురు పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్‌కు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.
మరోవైపు కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన కోసం చర్చలను ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకునే దిశగా ఈ పర్యటన సఫలీకృతమవుతుందని పేర్కొన్నారు. పెట్టుబడుల సాధన పర్యటనలో వచ్చే పది రోజులు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. సీఎం నాయకత్వంలోని బృందంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.