తెలంగాణలో గ్రామ స్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్ఠం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు, ఇతర విభాగాల్లో చేరిన వీఆర్‌ఏల సర్వీసుల పునరుద్ధరణ వంటి సమస్యలపై అధ్యయనం చేయాలని సర్కార్ నిర్ణయించింది.
ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్ విభాగం కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను సభ్యులుగా ఈ కమిటీలో నియమించారు.
వీఆర్‌ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసి 20,555 మంది వీఆర్‌ఏలలో 16,758 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే. 14,954 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.