నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట బుధవారం రోజున ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
ఇప్పటికే ఈ స్థానానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తుది ఓటరు జాబితాను వెలువరించారు. మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఉపఎన్నికకు ఇంకా బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించలేదు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం రోజున పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలోనే పనిలో పనిగా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూడా అభ్యర్థిని ఎంపిక చేసింది.