పార్టీని వీడి వెళ్తే కచ్చితంగా ఓడిద్దాం : రాజగోపాల్​రెడ్డి తీరుపై కాంగ్రెస్

-

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వార్తలు వచ్చినప్పుటి నుంచి ఆయన తీరుపై అధిష్ఠానం ఓ కన్నేసింది. ఎప్పటికప్పుడు ఆయన కదలికలు ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సాధ్యమైనంత వరకు సర్దిచెబుతాం.. పార్టీలో కొనసాగితే ముందులానే గౌరవిద్దాం.. కాదనుకొని వెళితే కచ్చితంగా ఓడించాల్సిందే’’నని కాంగ్రెస్‌ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. తెరాసను ఓడించే సత్తా భాజపాకే ఉందని వ్యాఖ్యానించడంతో పాటు ఈడీ పిలిస్తే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ విచారణకు వెళ్లాలంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది.

ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్‌ నివాసంలో బుధవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

రాజగోపాల్‌ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారనే భావనకు ఆయా నేతలు వచ్చారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా ఉండడం, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంలో సున్నితంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

పార్టీపరంగా తొలుత చర్యలు తీసుకోవద్దని.. ఆయన రాజీనామా చేస్తే వెంటనే రంగంలోకి దిగాలని మాట్లాడారు. అవసరమైతే రాజగోపాల్‌రెడ్డి కుటుంబం నుంచే ఒకరిని ఆయనపై బరిలో దింపాలని యోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు నేతలను వెంటనే దిల్లీ రావాలని ఆదేశించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version