కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా అని ఆరునెలల పాలన రుజువు చేసిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహజ వనరులను దోచుకుంటున్నారని, మంత్రి శ్రీధర్ బాబు అండతో మంథనిలో ఇసుక, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా ఒక లారీకి పర్మిషన్ ఉంటే వంద లారీల్లో మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు శ్రీధర్ బాబు కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్లోందని ఆరోపించారు. ఓటుకు 2 వేల రూపాయలు ఇచ్చి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడు ఇసుక మాఫియా గురించి నీతులు చెప్పిన శ్రీధర్ బాబు అదే దందాకు ఇపుడు తెర లేపారని విమర్శించారు. మంథని అభివృద్ధి గురించి శ్రీధర్ బాబు పట్టించుకోవడం లేదని.. కేవలం తన సంపాదనపైనే మంత్రి దృష్టి సారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.