మేడారం మహా జాతర ప్రత్యేక పూజలు నేడు ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభం అవుతున్నట్లు పూజారులు భావిస్తారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక ఈరోజు ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకు జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరం, కన్నెపల్లి సారలమ్మ గుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్ద రాజు, గోవింద రాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని పూజారులు తెలిపారు.
పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవని.. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో కొంత మంది పూజారులు అడవికి వెళ్లి మండలు (చెట్టు కొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ జరుపుకొనేవారని అర్చకులు చెబుతున్నారు. దీనినే మండమెలిగే పండగగా పేర్కొంటారని తెలిపారు. పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పని చేసి పగలంతా మండ మెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారని చెప్పారు. మరోవైపు మేడారం జాతరకు ఇప్పటికే భక్తులు భారీ ఎత్తున పోటెత్తుతున్న విషయం తెలిసిందే.