కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరు కానున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని గెలిపించడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి తనవంతు తోడ్పడతానని సింఘ్వీ తెలిపారు.
హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఓ హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ రాజ్యసభ ఉపఎన్నిక అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని రాష్ట్ర నేతలకు పరిచయం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని ఈ చట్టంలోని అంశాలపై రాజ్యసభతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని సీఎం న్నారు. ఇందుకోసమే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.