స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని.. సర్పంచ్ లు, ఎంపీటీసీలు మన వాళ్లనే గెలిపించాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. 2025 సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందని.. హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతానని.. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి పని చేయాలని సూచించారు.
నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు అందించడం నా తొలి ప్రాధాన్యత అని తెలిపారు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదే అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామ గ్రామాన ప్రతీ ఇంట్లో అవగాహన కల్పించాలని కోరారు. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం.. రైతులకు 2లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు.